మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర నీటి కాలుష్య సంక్షోభం రాజకీయ దుమారం రేపింది. కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి చెంది కనీసం 10 మంది మృతి చెందగా, వారిలో ఐదు నెలల శిశువు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇండోర్‌లో నీరు కాదు, విషమే పంపిణీ చేశారు. అయినా పరిపాలన నిద్రలోనే ఉంది అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దుర్వాసనతో, మురికిగా ఉన్న నీటి గురించి ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. మురుగు నీరు తాగునీటి పైపుల్లోకి ఎలా చేరిందని, సమయానికి సరఫరా ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. శుభ్రమైన నీరు దయ కాదు, జీవించే హక్కు అని పేర్కొంటూ, ఈ హక్కును హరించడంలో బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఇండోర్ ఘటనను మధ్యప్రదేశ్‌లో పాలనా వైఫల్యానికి నిదర్శనంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దగ్గు సిరప్ ఘటనలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వంటి గత ఉదాహరణలను గుర్తుచేశారు. పేదలు చనిపోతే మోదీజీ మౌనంగా ఉంటారు అని విమర్శించారు.
ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ మాట్లాడుతూ, భగీరథ్పుర ప్రాంతంలో కలుషిత నీటివల్ల డయేరియా వ్యాప్తి చెంది 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందన్నారు. అయితే స్థానికులు మృతుల సంఖ్య 14గా చెబుతున్నారు. ఆరోగ్య శాఖ ఈ సంఖ్యను ధృవీకరించలేదు. బాధిత ప్రాంతాల నుంచి వచ్చిన దృశ్యాలు విషాదాన్ని మరింత స్పష్టంగా చూపించాయి.
ఆరోగ్య శాఖ ప్రకారం ఇప్పటివరకు 1,400 మందికి పైగా వాంతులు, డయేరియాతో బాధపడగా, 272 మంది ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 201 మందిలో 32 మంది ఐసీయూలో ఉన్నారు. ల్యాబ్ పరీక్షల్లో పైప్‌లైన్ లీకేజ్ వల్ల తాగునీటిలో మురుగు కలిసినట్లు తేలిందని అధికారులు తెలిపారు. భగీరథ్‌పురలో పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో, మరుగుదొడ్డి నిర్మాణం ఉన్న ప్రాంతంలో ప్రధాన సరఫరా పైప్‌లో లీక్ గుర్తించారు.
