రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య” అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కరువు కోరల్లో ఉన్న రాయలసీమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. జగన్ హయాంలో రూ.960 కోట్లతో ఈ పనులు ముందుకు వెళ్లాయని, ఇప్పుడు వాటిని నిలిపివేయడం ప్రజలపై అన్యాయమని అన్నారు.
రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని రోజా ప్రశ్నించారు. ఇందుకోసమేనా పవన్ చంద్రబాబుతో చేతులు కలిపింది? ఇందుకోసమేనా కూటమిని గెలిపించింది? అంటూ మండిపడ్డారు. మ్యాప్‌లోనే ఈ రాష్ట్రం లేకుండా చేసేందుకే చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎం కావాలనుకుంటున్నారా అని తీవ్ర విమర్శలు చేశారు.
ఇదే సందర్భంలో ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపైనా రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, పోలీసు ఉద్యోగం మీద సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికంగా పనిచేస్తోందని చెప్పుకుంటున్నా, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె విమర్శించారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం పోరాటం ఆగదని రోజా స్పష్టం చేశారు.
