తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తన రాజకీయ విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
మీడియాతో మాట్లాడిన సంపత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల సొమ్మును గతంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబానికి దోచిపెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల కోసం కాకుండా కుటుంబ సభ్యుల కోసం పథకాలు నడిచాయని విమర్శించారు.
అప్పటి పాలనలో కేసీఆర్ బందు, కేటీఆర్ బందు, హరీష్ రావు బందు, కేటీఆర్‌కు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే జరిగాయని అన్నారు. అలాగే కవిత, సంతోష్ కుమార్ వంటి కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.
కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సంపత్ కుమార్ సూచించారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్టగా మారిపోయారని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇక కేటీఆర్ ప్రస్తుతం నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మీడియా హెడ్‌లైన్స్ కోసం మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలతోనే కాలం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సంపత్ కుమార్ సూచించారు.
