వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి, రాజు నాయక్ . తమ కుమార్తె మరణానికి కారణమైన దోషులను శిక్షించి తమ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాలో జరిగిన తమ కుమార్తె ప్రీతిపై అత్యంత కిరాతక అత్యాచారం హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోరం జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం లభించలేదంటూ జగన్ ఎదుట వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు చేశారు.
ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐ (CBI) విచారణకు అప్పగిస్తూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తమ కుటుంబ ఆకలి బాధలను తీర్చేందుకు కర్నూలు నగరంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించారని ఈ సందర్భంగా ప్రీతి తండ్రి రాజు గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించి తమను ఆర్థికంగా ఆదుకున్నారని జగన్ కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు తమకు ఎంతో భరోసాను ఇచ్చాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ సైతం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. బాధిత తల్లిదండ్రుల ఆవేదనను విన్న జగన్.. వారికి పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులకు శిక్ష పడే వరకు బాధితులకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.
