ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. న్యాయవృత్తిలో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ మహిళా న్యాయవాది గుడిమళ్ల సుభాషిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవ్యవస్థలో మహిళలకు తగిన అవకాశాలు కల్పించడంలో ఎన్నికల విధానాలు కీలకమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం మహిళల వాదనలను సమర్థిస్తూ కీలక తీర్పు వెలువరించింది.
బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను మహిళా రిజర్వేషన్‌తోనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు కనీసం 30 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది మహిళా న్యాయవాదులకు ఒక చారిత్రక విజయం గా న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డిసెంబర్ 20న బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, జనవరి 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో మహిళా రిజర్వేషన్ అమలు కావడం ద్వారా న్యాయవృత్తిలో మహిళల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
