ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణను మరింత కాలం పాటు పొడిగిస్తూ, తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రభాకర్ రావు తనకు ఇచ్చిన మధ్యంతర రక్షణను కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఇప్పటికే రెండు వారాల పాటు కస్టడీలో ఉండి, విచారణకు పూర్తిగా సహకరించాడని, అయినప్పటికీ విచారణను నిరవధికంగా కొనసాగించడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై విచారణను ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు.
ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్నం నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది. “ఇంకెంతకాలం విచారణ చేస్తారు? విచారణ ఉద్దేశం ఇంకా పూర్తికాలేదా? ప్రభాకర్ రావును జైలులో పెట్టడమే లక్ష్యంగా ఈ విచారణ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రభుత్వం తరపు వాదనల్లో స్పష్టత లేకపోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం ప్రభాకర్ రావుకు ఎలాంటి ప్రమాదం కలగకుండా మధ్యంతర రక్షణను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ తీర్పు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
