2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ శాతం పెరుగుదలపై వెలువడిన గణాంకాలు వివాదానికి దారి తీశాయి. ఎన్నికల రోజు మే 13న సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం పోలింగ్ నమోదైందని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ప్రకటించారు. ఇంకా భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉన్నారని కూడా తెలిపారు. అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12 శాతంగా ఉందని ప్రకటించగా, రాత్రి 11:45 గంటలకు అది ఒక్కసారిగా 76.50 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
ఈ లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 వరకు దాదాపు 8.38 శాతం పోలింగ్ పెరిగినట్టు అవుతోంది. మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, రాత్రి 11:45 తర్వాత కూడా సుమారు 3,500 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ కొనసాగిందని, ఆ బూత్‌లలో మరో 4.16 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66 శాతానికి చేరిందని పేర్కొన్నారు. అనంతరం మే 17న విడుదల చేసిన పూర్తి గణాంకాల్లో 80.66 శాతం పోలింగ్ నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86 శాతం నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీ మొత్తం పోలింగ్ శాతం 81.79గా ఉండటం మరో సందేహానికి కారణమైంది. రాష్ట్ర, కేంద్ర గణాంకాల మధ్య స్వల్ప వ్యత్యాసం కనిపించడం విశ్లేషకులను ఆలోచనలో పడేసింది.
ఇక ప్రధానంగా చర్చనీయాంశమైన విషయం రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య నమోదైన ఓట్ల సంఖ్య. సీఈవో ప్రకటించిన వివరాల ప్రకారం ఈ 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3,500 బూత్‌లలో కలిపి 17,19,482 ఓట్లు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఒక్కో బూత్‌లో సగటున 491 ఓట్లు నమోదైనట్లు అవుతుంది. ఒక నిమిషానికి ఒక్క ఓటు వేయబడుతుందని భావించినా 491 ఓట్లు నమోదు కావడానికి దాదాపు 8 గంటల సమయం అవసరం అవుతుంది. అయితే ఇది కేవలం రెండు గంటల్లోనే ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకవేళ నిజంగానే 2 గంటల్లో 491 ఓట్లు నమోదయ్యాయని తీసుకుంటే, ఒక్క నిమిషానికి సుమారు 3.6 ఓట్లు నమోదు కావాలి. అంటే ప్రతి ఓటర్ గుర్తింపు ధృవీకరణ, వేలిముద్ర, ఇంక్ పెట్టడం, ఓటు వేయడం వంటి ప్రక్రియలు సుమారు 20 సెకన్లలో పూర్తవ్వాలి. ఇది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా రాత్రి 11:45 తర్వాత ప్రతి బూత్ వద్ద 100 నుంచి 135 మంది ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారని భావించినా, 491 ఓట్లు ఎలా నమోదయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అర్ధరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని మే 14న జరిగిన ప్రెస్ మీట్‌లో సీఈవో వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వద్ద ఈ గణాంకాలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయా? అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో నిలబడ్డ 17 లక్షలకుపైగా ఓటర్లకు సంబంధించిన వీడియోలు లేదా ధృవీకరణ వివరాలు విడుదల చేయగలరా? అనే ప్రశ్నలు విశ్లేషకులు సంధిస్తున్నారు.
ఈ అన్ని అంశాలు కలిపి చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గణాంకాలపై స్పష్టత అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ విషయంపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని రాజకీయ వర్గాలు కోరుతున్నాయి.
