పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోద, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ఎన్డీఏ ముఖ్య నేతలు హాజరయ్యారు.
2011 నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో తెరపడింది. 294 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో బెంగాల్‌లో తొలిసారి కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సువేందు అధికారి, ఇప్పుడు ఆమె రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికిన నేతగా నిలిచారు. నందిగ్రామ్ పోరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు.
బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాదిగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం భారీ టెంట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేడుకకు వచ్చిన ప్రజలకు బెంగాలీ ప్రత్యేక వంటకాలు, జాల్‌మురి స్టాళ్లు కూడా ఏర్పాటు చేయడం ఆకర్షణగా నిలిచింది.
సువేందు అధికారితో పాటు బీజేపీ సీనియర్ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తనియా, నిశిత్ ప్రమాణిక్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
