పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ మరియు భవానీపూర్ రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, తాజాగా తన శాసనసభ సభ్యత్వానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
సువేందు అధికారి తాను గెలిచిన రెండు సీట్లలో భవానీపూర్ నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం (మే 13, 2026) ఆయన అసెంబ్లీలో భవానీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మమతా బెనర్జీపై చారిత్రాత్మక విజయం సాధించిన తన సొంత నియోజకవర్గం నందిగ్రామ్ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గం ఇప్పుడు ఖాళీ అయింది, అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.
కోల్‌కతాలోని అసెంబ్లీ హౌస్‌లో ప్రొటెం స్పీకర్ తాపస్ రాయ్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన శాసనసభ మెట్లపై వంగి నమస్కరించి సభలోకి ప్రవేశించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణానికి భూమి బదిలీ, ఆయుష్మాన్ భారత్ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
