- Advertisement -

నన్ను చంపాలని చూస్తున్నారు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. తన నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు కేవలం చోద్యం చూస్తూ నిలబడ్డారని ఆయన మండిపడ్డారు. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ కొనసాగుతోందని, ఇలాంటి దాడులు, దహనకాండలు గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ నేతృత్వంలోనే ముందుగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని, ఆ ఘటన మరచిపోకముందే ఇప్పుడు తన ఇంటిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు తనను హత్య చేయాలని అనుకుంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. లోకేశ్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీ మూకలను రంగంలోకి దించారని ఆరోపించారు. పెట్రోలు బాంబులు, ఇనుప రాడ్లతో దాడులు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలను భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, అయితే ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.

లోకేశ్ రాక్షసానందం, పిల్ల చేష్టలు మానుకోవాలని జోగి రమేశ్ హితవు పలికారు. “టీడీపీ చంద్రబాబు పార్టీ కాదు.. ఎన్టీఆర్ పార్టీ” అని తాను అన్నానని, “లోకేశ్ ఒళ్లు తగ్గింది, బుర్రపోయింది” అన్న వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ప్రశ్నించారు. గతంలో తమపై టీడీపీ నేతలు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

జోగి రమేశ్ ఇంటిపై దాడిని వైసీపీ నేత చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంపై వందలాది మంది టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను చించివేసి, ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇంట్లోని ఫర్నీచర్‌కు మంటలు అంటుకుని దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడి సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -