ఏపీ సీఎం జగన్ బాటలోనే ముందుకు సాగుతున్నారు తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో కులగణన చేపట్టారు జగన్. ఇందుకోసం గ్రామాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు కింద పలు గ్రామాల్లో విజయవంతంగా చేపట్టారు. ప్రస్తుతం ఏపీలో కులగణన విజయవంతంగా సాగుతోంది. కులగణన ద్వారా ప్రభుత్వ పథకాలు పేదలకు మరింత చేరువ కానున్నాయి.
దీంతో ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్. తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని.. సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని అధికారులకు సూచించారు.
బీసీ డిక్లరేషన్ అమలుకు రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత అన్నది తేలాల్సి ఉంది. ఇక బీసీలు కూడా కొన్నేళ్లుగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ ఆ వివరాలను ఎక్కడా బయటపెట్టలేదు. దీంతో కులగణనకు సంబంధించి చర్యలు చేపట్టాలని తెలిపారు రేవంత్. బీసీల సంఖ్య తేల్చినప్పుడే ఏ కులం వెనుకబాటులో ఉంది. ఏ కులం ముందులో ఉంది? అనేది తేలనుంది. బీసీల్లో ఉన్న కులాలు ఎన్ని? ఏ కులం ఎంత శాతంలో ఉంది? తేలే అవకాశం ఉండటంతో త్వరలోనే కులగణనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
