తెలంగాణలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యవసర సేవలకు ఎలాంటి గ్యాస్ కొరత తలెత్తకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు.
గ్యాస్ సరఫరా వ్యవహారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చిందని చెప్పారు. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్రానికి 1740 కిలోలీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో సివిల్ సప్లై కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇక జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులు, ఎల్పీజీ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్ సివిల్ సప్లై కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హోటళ్లు, రెస్టారెంట్ యజమానులు తమను అత్యవసర సేవలుగా గుర్తించి సిలిండర్ల సరఫరా చేయాలని చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
