వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇదే పేరు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల గుండెల్లో మార్మోగిపోతోంది. ఒక 15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌ను క్రికెట్ ఆడే..చూసే.. సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని ఎలా మార్చేస్తున్నాడు అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔరా అనిపించాడు. సన్ రైజర్స్ బౌలర్లను ఉచకోత కోస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు.
అది ఒక ప్లేఆఫ్ మ్యాచ్. గెలవితీరాల్సిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయడం..ఎస్ఆర్హెచ్పై ఆర్ఆర్కు ఉన్న పేలవమైన రికార్డు ఇవేమి పట్టించుకోని వైభవ్ తన పని తాను చేసుకెపోయాడు. తను ఎదుర్కొన్న మొదటి ఓవర్లోనే ప్యాట్ కమిన్స్‌ను పూర్తిగా బోల్తా కొట్టించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కమిన్స్ లెగ్ సైడ్ ఇద్దరు ఫీల్డర్లను ఉంచి వైభవ్ బ్యాట్ స్వింగ్‌ను నియంత్రించడానికి ఫుల్ లెంగ్త్ బాల్స్ వేశాడు.
కానీ వైభవ్ ముందు అది పనిచేయలేదు. కమిన్స్ ఓవర్లో 25 పరుగులు రాబట్టాడు. ప్రతి బంతికి ఫీల్డింగ్ మార్చినా ప్రయోజనం లేకపోయింది. లాంగ్-ఆఫ్, లాంగ్-ఆన్ మధ్య చాలా స్ట్రెయిట్ ఫీల్డింగ్ పెట్టినా ఫలితం లేదు. వైభవ్ చేసిన 97 పరుగులలో 37 పరుగులు ఆ జోన్ నుండే వచ్చాయి. ఆ సమయంలో జేమ్స్ బాండ్లా ప్రశాంతంగా ఉండే కమిన్స్ కూడా చెమటలు కక్కుతూ ప్రతి బంతికి ఫీల్డింగ్ మార్చాల్సి వచ్చింది. ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ అందరూ వచ్చి సలహాలు ఇచ్చినా కమిన్స్ దగ్గర సమాధానం లేకపోయింది.
ఒక దశలో 10 బంతుల వ్యవధిలో సూర్యవంశీ 6 సిక్సర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి 20 బంతుల్లో 60 పరుగులు చేసిన అతడు తర్వాతి 9 బంతుల్లో మరో 37 పరుగులు జోడించాడు. చివరికి అవే మ్యాచ్ ఫలితాన్ని శాసించాయి. వైభవ్ ‘బాల్స్/సిక్స్’ రేషియో 4.3 గా ఉండగా ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమం.
ఎక్కువగా ఆలోచించకపోవడమే సూర్యవంశీ అతిపెద్ద బలం. మేము అతనితో ఎక్కువగా మాట్లాడము ఒంటరిగా వదిలేస్తాము అని మ్యాచ్ తర్వాత రియాన్ పరాగ్ చెప్పాడు. వైభవ్ గురించిన అత్యుత్తమ విషయం ఏంటంటే అతను దేనికీ ప్లాన్ చేయడు అని ధ్రువ్ జురెల్ అన్నాడు. కేవలం రెండేళ్లలోనే సూర్యవంశీ ఐపీఎల్ స్టార్‌గా మారిపోగా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.
