విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు కీలక విభాగాలను ప్రైవేటు చేతులకు అప్పగించిన ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) తాజాగా మరో కీలక అడుగు వేసింది. ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానించడం తీవ్ర చర్చకు దారి తీసింది.
క్యాప్టివ్ పవర్ ప్లాంట్లోని కోల్ హ్యాండ్లింగ్ వ్యవస్థతో పాటు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆర్ఐఎన్ఎల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉక్కు కర్మాగారంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం కీలకంగా పనిచేస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్లడం భవిష్యత్తులో మరిన్ని విభాగాలు కూడా ప్రైవేటుకు వెళ్లే సూచనగా కార్మికులు భావిస్తున్నారు.
ఇప్పటికే కార్మికుల తొలగింపు, ఔట్సోర్సింగ్ పెరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. కీలక విభాగాలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థను బలహీనపరుస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో భాగంగా ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రైవేటీకరణ నిర్ణయాలు కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై ఆందోళన మరింత పెరుగుతోంది.
