ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు టార్గెట్ చేసిన వైసీపీ నేతల్లో ఒకరు మాజీ మంత్రి రోజా. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా…టీడీపీ నేతల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఫలితంగా ఇప్పుడు కూటమి నేతలు ఆమెను ప్రధానంగా టార్గెట్ చేశారు. అందుకే రోజా తమిళనాడుకు షిఫ్ట్ అయిపోతుందని తీవ్ర ప్రచారం చేశారు.
కానీ సీన్ కట్ చేస్తే వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు రోజా. ఆ వెంటనే తన సొంత నియోజకవర్గం నగరిపై దృష్టి సారించారు రోజా. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో తన ఓటమికి పనిచేసిన నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు. నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయించి మళ్లీ నగరిపై పట్టు పెంచుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లా నేతలతో ఇటీవల సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్. ఇందులో భాగంగా తన ఓటమికి కారణాలను జగన్‌కు వివరించారు రోజా. ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతి దంపతులపై వేటు వేయాలని కోరగా స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకున్న జగన్.. శాంతితో పాటు ఆమె భర్త కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేశారు. దీంతో నగరి తనదేనని సంకేతాలిచ్చిన రోజా..కేడర్‌ని కాపాడుకుంటానని చెబుతున్నారు.
