వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామివారి ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా సాగాయి.
ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా, జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పాలు, పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…దేవాలయాలు మన సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల నిలయాలని అన్నారు. భక్తి మార్గం మనుషుల్లో సానుకూల భావనలు పెంచి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం విస్తరించడమే కాకుండా గ్రామ ఐక్యత మరింత బలపడుతుందని చెప్పారు.
నూతన విగ్రహ ప్రతిష్ఠను విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి మరియు కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ మహోత్సవంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆధ్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.
