టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఇది. ఇటీవల భుజానికి గాయమై ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స అనతరం తాజాగా కిమ్స్ (KIMS) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కుడి భుజానికి వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్య బృందం అధికారికంగా వెల్లడించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎన్టీఆర్ విశ్రాంతి నిమిత్తం తన ఇంటికి చేరుకున్నారు.
కొద్ది రోజుల క్రితం జిమ్లో కసరత్తులు చేస్తుండగా ఎన్టీఆర్ కుడి భుజానికి తీవ్ర గాయమైంది. దీనిపై ఆయన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా, భుజానికి సర్జరీ తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు ‘ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ’ (Arthroscopic Surgery) విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న ఎన్టీఆర్, వైద్య బృందంతో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన ఆయన అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్ట్లు పెడుతున్నారు.
శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ, ఎన్టీఆర్ పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టనుంది. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. భుజం కండరాలు సాధారణ స్థితికి వచ్చి, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇదిలాఉంటే, తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థించిన ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషులకు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మరింత ఉత్సాహంగా ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.
