తెలంగాణలో నీటి వనరుల హక్కుల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి అన్నదాతల కళ్లలో ఆనందం చూస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలు తమ పాలనలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని సీఎం పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగానే అత్యాధునిక హంగులతో కూడిన సరికొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 8 కొత్త వైద్య కళాశాలలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
విద్యా రంగంలో సంస్కరణల వల్ల జాతీయ విద్యా సూచీలో గతంలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ, ప్రస్తుతం 14వ స్థానానికి పురోగమించిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో వందకు పైగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ బడుల్లో ఉదయం పూట అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశామని సీఎం గుర్తుచేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘సీఎం కప్’ పోటీలను నిర్వహించామని, త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మక ‘ఖేలో ఇండియా’ క్రీడా వేడుకలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని తెలిపారు. పారిశ్రామిక రంగంలోనూ తెలంగాణ దూసుకెళ్తోందని, ‘టీఎస్ ఐపాస్’ ద్వారా సుమారు రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని పేర్కొన్నారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో మరో 78 వేలకు పైగా నూతన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్లో తమ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని, ప్రస్తుతం నగరంలో 355కు పైగా జీసీసీలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. తాజాగా అమెజాన్ సంస్థ రాష్ట్రంలో ఏకంగా 7 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్ట ముందుకు వచ్చిందని వివరించారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాలను ఆర్టీసి అద్దె బస్సులకు యజమానులుగా మార్చామని గుర్తుచేశారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ఇప్పటివరకు 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని, స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నేడే రెండో విడత కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, భద్రత కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని సీఎం గర్వంగా పేర్కొన్నారు.
