మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై, జీవితాంతం కలిసి బతకాల్సిన ఆ దంపతుల జీవితం నెల రోజులకే విషాదాంతమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడిగా మారి భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలో వెలుగు చూసింది. కొత్తగా పెళ్లయిన ఇంట తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్‌కు, గుంటూరుకు చెందిన శాంతి (26)కి కొంతకాలం క్రితం ఓ మ్యాట్రిమొనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను కాదో లేక పరిస్థితుల రీత్యా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అయితే, ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. పెళ్లి అనంతరం ఈ దంపతులు అనంతపురం నగరంలోని యల్లమ్మకాలనీలో ఓ అద్దె ఇంటిని తీసుకుని కాపురం పెట్టారు. శాంతి ఇంట్లోనే ఉండగా, మహేష్ ఆటో సహాయంతో పాల ప్యాకెట్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఏమైందో ఏమో కానీ, గతంలో వీరి మధ్య తలెత్తిన మనస్పర్థలో లేక ఇతర కారణాల వల్ల మూడు రోజుల క్రితం మహేష్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లోని రోకలిబండతో శాంతి తలపై, శరీర భాగాలపై తీవ్రంగా మోది దారుణంగా హత్య చేశాడు. భార్య ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
కొత్తగా పెళ్లయిన దంపతులు కావడంతో బంధువుల ఊళ్లకు వెళ్లారేమోనని ఇంటి యజమానులు తొలుత భావించారు. కానీ బుధవారం ఉదయం ఆ ఇల్లు నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు, యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. శాంతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులో ఉన్న మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అనంతపురం డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు మహేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
