మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంబటి రాంబాబును హత్య చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ గూండాలు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, ఈ అరాచక పాలనను ప్రజలు ఎప్పటికీ సహించరని జగన్ స్పష్టం చేశారు. అంబటికి వైసీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా, గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నిన్న రాత్రి పోలీసులు అంబటిని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో అంబటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా, అంబటి ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు కార్లకు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ పరిణామాలపై అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు దాదాపు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తమ కుటుంబానికి 24 గంటల భద్రత కల్పించాలని విజయలక్ష్మి హైకోర్టును కోరారు.
