- Advertisement -

వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీ.. జగన్ ఆగ్రహం

- Advertisement -

వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనిని చేసినట్లుగా చెప్పుకుంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర, ఎవరి హయాంలో ఎంత పనులు జరిగాయో లెక్కలతో సహా వివరించూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు.

వైఎస్సార్ స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్ట్ సాకారం కావడం ఎంతో సంతృప్తినిచ్చిందని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేశామని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మాత్రం దీనిపై పబ్లిసిటీ ఫీట్లు చేస్తూ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

1996లో ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఆ తర్వాత ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేదని జగన్ ఎద్దేవా చేశారు. ఆ కాలంలో ఆయన ఖర్చు చేసింది కేవలం రూ. 10 లక్షలేనని, అదీ సభ ఏర్పాట్లకే సరిపోయిందని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలోనే జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపం వచ్చిందని తెలిపారు.

మొత్తం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాల్లో వైఎస్సార్ హయాంలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయని తెలిపారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం 6.686 కిలోమీటర్లు మాత్రమే తవ్వారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ మిగిలిన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేసి, 2024 మార్చి 6న జాతికి అంకితం చేశామని వెల్లడించారు.

ప్రాజెక్టు పూర్తి క్రెడిట్ తామే చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని జగన్ అన్నారు. పెద్దదోర్నాల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పనులను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు. ప్రచారపు ఆర్భాటాలు పక్కన పెట్టి, నల్లమలసాగర్‌ను నింపి రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -