ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కర్నూల్ వేదికగా మోడీ దీపావళి టపాకాయ తుస్సుమంది. వచ్చింది ఏపీకి.. వేసింది బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం. కేవలం బీహార్ ఎన్నికలను ప్రభావితం చేయడానికే. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయలకు తెరలేపి, మరోసారి రాష్ట్ర ప్రజలకు మోడీ గారు చేసింది ఘరానా మోసమే అని ఆరోపించారు.
మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి ఇచ్చారా ? రూ.1657 కోట్లతో పెండింగ్ మాస్టర్ ప్లాన్ మీకు కనబడలేదా ? ఉజ్జయిని, వారణాసి, గంగానది కారిడార్ల అభివృద్ధిపై చూపిన ప్రేమ మల్లన్న కారిడార్ పై ఎందుకు లేదు ? శ్రీశైలం క్షేత్ర కారిడార్ నిర్మాణ పనులకు కేంద్రం నుంచి అనుమతి ఇవ్వడానికి మనసు ఎందుకు రాలేదు ? ఇది మల్లన్నకు మీరు చేసిన ద్రోహం కాదా ? చెప్పాలన్నారు.
11 ఏళ్ల క్రితం తిరుపతి వేదికగా చెప్పిన పిట్టకథే మళ్ళీ చెప్పారు. ఢిల్లీకి – రాష్ట్ర రాజధానికి లింక్ పెట్టారు. అరకొర అప్పులు ఇస్తే ఢిల్లీతో అమరావతి పోటీ పడుతుందా ? అప్పులకు హామీలు ఇచ్చినంత మాత్రాన ప్రగతిలో పరుగులు పెడుతుందా ? రాజధానికి లక్ష కోట్ల అప్పులు తెస్తే రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారుతుంది ? ప్రగతి ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి ? ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ ఎలా కీలకం అవుతుంది ? చెప్పాలన్నారు.
ప్రత్యేక హోదాపై నోరు విప్పలేదు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటనే లేదు. కడప స్టీల్ ఊసేలేదు. పారిశ్రామిక వాడల ఏర్పాటుపై ప్రస్తావనే లేదు. విశాఖ స్టీల్ కి భరోసా లేదు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి 4 సార్లు మోడీ రాష్ట్ర పర్యటన చేసినా విభజన హామీలపై ఒక్కమాట లేదు. వినేవాడుంటే చెప్పేవాడు మోడీ అన్నట్లు.. మోసం చేసేది మోడీ గారైతే..మోసపోయేది ప్రతిసారీ రాష్ట్ర ప్రజల వంతు అవుతుంది అన్నారు.
