గత కొద్ది రోజులుగా జులై 18న ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారని, తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి పొలిటికల్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు హోరెత్తాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తన పార్టీతో రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం, గతంలో తారక్‌కు టీడీపీతో ఉన్న అనుబంధం, కేంద్ర నాయకత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన నేపథ్యంలో, తెలుగు హీరోలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తరచుగా వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అదే కోవలో, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని, జూలై 18న ఆయన ఏదో ఒక కీలక ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు, మీడియాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. “జులై 18న జరగనున్న ‘ఊరు-వాడ’ కార్యక్రమం కోసం మేము ఎప్పుడో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది కేవలం సేవా కార్యక్రమాల లక్ష్యంతో నిర్వహించేది మాత్రమే. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు,” అని వారు ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఈ ప్రచారం వల్ల అభిమానులు అనవసర అయోమయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ప్రస్తుతానికి ఎన్టీఆర్ తన పూర్తి దృష్టిని కేవలం సినిమా ప్రాజెక్టులపైనే కేంద్రీకరించారని, రాజకీయాల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వదంతులను నమ్మవద్దని అభిమానులను కోరుతున్నారు.
