‘‘అవసరమైతే నీకోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా.. గానీ నిన్ను మాత్రం వదలను మంగ’’.. అంటూ సాగే డైలాగుతో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తిరుపతి నేపథ్యంలో సాగే ఓ బలమైన ప్రేమకథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. శ్రీను అనే పాత్రలో తన ప్రేమ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే కుర్రాడిగా జయకృష్ణ నటించారు. కథానాయిక రషా థడానీతో ఆయనకు ఉన్న కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఈ నెల 30న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ తన తాతయ్య సూపర్‌స్టార్ కృష్ణను స్మరించుకున్నారు. ‘‘మా తాతయ్య లేకపోతే నేను లేను, ఆయన నా దేవుడు. ఈ చిత్ర ప్రయాణంలో బాబాయ్ మహేశ్‌బాబు నాకు ఎంతో అండగా నిలిచారు. ప్రీరిలీజ్ వేడుకకు ఆయన తప్పకుండా వస్తారు’’ అని జయకృష్ణ తెలిపారు.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘‘జయకృష్ణ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశాడు. మా సినిమా ట్రైలర్ చూసిన మహేశ్‌బాబు ‘సూపర్’ అని మెసేజ్ చేశారు’’ అని పేర్కొన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని నిర్మాత ఆదిశేషగిరి రావు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, బుద్ధా వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
