దేశంలో ప్రజలు ఎక్కువ తప్పులు చేసి దేవుడా నీదే భారం అంటున్నారని, అంతే కాకుండా దేవుడి హుండీలో ఎక్కువ డబ్బులు కూడా వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు లేకుంటే ప్రజలకు పిచ్చి ఎక్కేదని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఎక్కువ డబ్బులు హుండీల్లో వేయడం వల్ల ఎపిలో దేవాలయాల ఆదాయం ఎంతో పెరిగిందని ఆయన అన్నారు. మద్యం మానేయడం కోసం కొంతమంది దీక్షలు తీసుకుంటున్నారని, ఆ సమయంలో మద్యం దుకాణాల ఆదాయం ఎంతో తగ్గిపోతోందని కూడా చంద్రబాబు అన్నారు. ఎపి ఆదాయ అభివృద్ధికి అధికారులు ఏమాత్రం కష్టపడకపోయినా 27 శాతం ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.
పక్క రాష్ట్రాల అభివృద్ధి చూసి తనకు అసూయగా ఉందని, ఇతర రాష్ట్రాల కంటే బాగా పని చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నానని సిఎం అన్నారు. రాష్ట్ర రెవెన్యూ 3.1 శాతం పెరిగిందని సిఎం చెప్పారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజకీయనాయకులు, అధికారులు అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, దాన్ని పోగొట్టుకునేలా అందరూ కష్టపడాలని ఆయన అన్నారు.
