రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలపై ఉన్న ఉత్కంఠకు తెరదించారు తెలంగాణా సీఎం. ప్రగతి నివేదన సభ కంటే ముందే కేబినేట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతోపాటు శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆదివారం జరగబోయే రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలోనే శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్లి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతోపాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలంటే ఇక్కడ శాసనసభను రద్దు చేస్తేనే సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా ఆదివారం మంత్రివర్గ సమావేశంలో శాసనసభ రద్దుకు తీర్మానం చేయవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని సభ పూర్తయిన తర్వాత మరోసారి మంత్రి వర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పింఛను మొత్తం పెంపు, ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి మొదట మంత్రివర్గ సమావేశం జరుగుతుందని.. ఆ తర్వాత కేవలం శాసనసభ రద్దు కోసమే ఇంకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని తెలిసింది. ఇక మొత్తమ్మీద 10వ తేదీలోగా శాసనసభ రద్దు ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
లేక పోతే అందరూ అనుకుంటున్నట్లు శాసనసభను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేస్తే సమావేశం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలుస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలియజేశాయి. శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్‌కు అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రగతి నివేదిన సభకు వస్తారని సమాచారం. అయితే ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో శాసనసభ రద్దు ఉంటుందా లేదా అనే విషయంలో మంత్రులకు స్పష్టత లేదు
శాసన సభ రద్దుకు నిర్ణయం తీసుకొని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం, విపక్షాల రాజకీయాలు, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తీసుకొన్న నిర్ణయాన్ని వివరించి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు కేసీఆర్.
