హన్మకొండ జిల్లాలో ఒక పెళ్లి ఇంట్లో ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారిన ఘటన కలకలం రేపింది. రెండు రోజుల్లో వివాహాం జరగాల్సి ఉండగా పెళ్లికొడుకు అదృశ్యమవడంతో వధువు కుటుంబం తీవ్ర నిరాశలో మునిగిపోయింది.
హన్మకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు, పెళ్లి కార్డులు పంచుతానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. అయితే, అతను ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మరియు వధువు కుటుంబం ఆందోళనకు గురయ్యారు. మొదట అతను పనిలో బిజీగా ఉన్నాడని భావించినా, తరువాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
వధువు తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం, కిరణ్ ఇటీవల అదనపు కట్నం డిమాండ్ చేశాడని తెలిసింది. ఈ డిమాండ్‌ను వారు తిరస్కరించడంతో, పెళ్లి తప్పించుకునేందుకు కిరణ్ ఇలా పారిపోయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తయి, గత మార్చి 3వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తరువాత రేపు పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లికి ముందు రోజు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులను షాక్‌కు గురిచేసింది.
ఈ ఘటనపై ఆగ్రహించిన వధువు కుటుంబ సభ్యులు, కిరణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
