పెళ్లి అంటే నూరేళ్ల పంట.. ఆ వేడుకలో వెయ్యి పనులుంటాయి. కానీ, ఆ హడావిడిలోనూ తమ పౌర బాధ్యతను మరవలేదు ఈ నవ దంపతులు. పెళ్లి పీటల మీద నుంచి దిగీదిగగానే, బంధుమిత్రులతో విందు వినోదాల్లో మునిగిపోకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెన్నైలోని కోడంబాకంలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. నవ వధువు సువర్ణ, వరుడు సునీల్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, తాళి కట్టిన కేవలం 15 నిమిషాల్లోనే వధువు సువర్ణ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది.
పెళ్లి కూతురు అలంకరణలో, చేతికి మెహందీ ఉన్నప్పటికీ.. ఓటు వేయడమే ప్రథమ కర్తవ్యమని భావించిన సువర్ణను వరుడు సునీల్ దగ్గరుండి పోలింగ్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పెళ్లి దుస్తుల్లోనే వచ్చిన ఈ జంటను చూసి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వారంతా ఆశ్చర్యపోవడమే కాకుండా, వారి బాధ్యతాయుత ప్రవర్తనను ప్రశంసలతో ముంచెత్తారు.
ఓటు వేసిన అనంతరం సువర్ణ మాట్లాడుతూ.. పెళ్లి ఎంత ముఖ్యమో, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు కూడా అంతే ముఖ్యం. అందుకే సమయం వృధా చేయకుండా ఇక్కడికి వచ్చాను” అని పేర్కొంది.సాధారణంగా చిన్న కారణాలతో ఓటు వేయడానికి బద్ధకించే వారికి, ఈ నవ దంపతులు ఒక గొప్ప సందేశాన్ని అందించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
