- Advertisement -

పరకాల ల్యాబ్ టెక్నీషియన్ మృతి కేసులో సంచలన ట్విస్ట్!

- Advertisement -

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సంచలనం సృష్టించిన ల్యాబ్ టెక్నీషియన్ షరిఫోద్దీన్ అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. అది రోడ్డు ప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దారుణ హత్య అని పోలీసులు తేల్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన పరకాలకు చెందిన టీస్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్ (31)ను పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. మృతుడి భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధమే ఈ దారుణ హత్యకు దారితీసిందని పరకాల ఏసీపీ సతీశ్‌బాబు వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలలో నివసిస్తున్న ఎండీ షరిఫోద్దీన్ హనుమకొండలోని ఒక ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను రోజూ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లే సమయంలో.. తన భార్యకు టిఫిన్ ఇచ్చి రావాలని ఇంటి సమీపంలో టీస్టాల్ నడుపుతున్న సందీప్‌కు చెప్పేవాడు. ఈ క్రమంలో రోజూ ఇంటికి వెళ్లి టిఫిన్లు ఇచ్చే నెపంతో షరిఫోద్దీన్ భార్యతో సందీప్‌కు అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో తను చెప్పకపోయినా సందీప్ తరచూ తన ఇంటికి వెళ్తున్నట్లు గమనించిన షరిఫోద్దీన్.. ఈ నెల 2న ఉదయం సందీప్ వద్దకు వెళ్లి “ఈ రోజు నీతో మాట్లాడాలి.. డ్యూటీ ముగించుకుని వచ్చాక కలుస్తా.” అని హెచ్చరించాడు. తమ వ్యవహారం షరిఫోద్దీన్‌కు తెలిసిపోయిందని గ్రహించిన సందీప్.. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు.

ఆ రోజు సాయంత్రం షరిఫోద్దీన్ ఇంటికి రాగానే.. సందీప్ వేరొకరి ఫోన్ నుండి వాట్సాప్ కాల్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఒక ఇటుకల బట్టీల షెడ్డు వద్దకు రమ్మని పిలిచాడు. అక్కడికి చేరుకున్న షరిఫోద్దీన్, సందీప్ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో.. “నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా?” అంటూ షరిఫోద్దీన్ సందీప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన సందీప్.. పక్కనే ఉన్న ఒక లావుపాటి కర్రతో షరిఫోద్దీన్ తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సందీప్ పక్కా డ్రామా ఆడాడు. మృతదేహాన్ని షరిఫోద్దీన్ బైక్‌పైనే అడ్డంగా వేసుకుని రోడ్డు మీదికి తీసుకొచ్చి.. ఎవరూ లేని సమయం చూసి రోడ్డుపై పడేసి పారిపోయాడు.

ఇంటికి వెళ్ళాక రక్తపు మరకలైన తన షర్టును బాత్రూం వెనుక కాల్చి బూడిద చేసి.. మిగతా బట్టలను ఉతికిన బట్టల్లో కలిపి సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేశాడు. అయితే, ఘటనా స్థలాన్ని చూసి అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు రజాక్.. ఇది రోడ్డు ప్రమాదం కాదు హత్యేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరపగా సందీప్ ఆడిన నాటకం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పరకాల సీఐ క్రాంతికుమార్, ఎస్‌ఐలు రమేశ్, పవన్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -