కళ్లముందు కోట్లలో ప్యాకేజీలు.. ఏసీ గదుల్లో ఐటీ కొలువులు ఉన్నా.. మట్టి వాసనపై ఉన్న మక్కువతో ఆ టెకీ సాగుబాట పట్టాడు. సరికొత్త సాంకేతికతతో ఆధునిక వ్యవసాయం చేసి సరికొత్త ఆదర్శంగా నిలవాలనుకున్నాడు. దురదృష్టం అతడిని మృత్యురూపంలో వెంటాడింది. సేద్యంలో కొత్త ప్రణాళికలు వేస్తూ పొలం చూసేందుకు వెళ్లిన ఆ యువ రైతును ఆకాశం నుంచి వచ్చిన పిడుగు బలితీసుకుంది. కన్న కలలు.. నమ్ముకున్న మట్టి సాక్షిగా ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితం అక్కడికక్కడే ముగిసిపోయిన అత్యంత పరాకాష్ట విషాదం కర్ణాటకలోని మైసూరులో వెలుగుచూసింది.
మడికెరి పట్టణానికి చెందిన రోషన్ బాలకృష్ణ (43) చాలా కాలం పాటు ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ప్రకృతి.. వ్యవసాయంపై ఉన్న అమితమైన ఆసక్తితో ఇటీవల తన చేతిలో ఉన్న ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. కేవలం వ్యవసాయం చేయడమే కాకుండా.. ఒక స్నేహితుడితో జతకట్టి ఆధునిక వ్యవసాయ పరికరాల మార్కెటింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. సరికొత్త ఆలోచనలతో సాగును లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో కుటుంబ సభ్యులను తీసుకుని మైసూరు పరిసరాల్లో ఉన్న ఒక పొలాన్ని పరిశీలించడానికి వెళ్లాడు.
పొలాన్ని చూస్తూ అక్కడ ఉన్న ఒక మామిడి చెట్టు వద్ద పండ్లు కోసేందుకు రోషన్ బాలకృష్ణ ముందుకు కదిలాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడింది. ఈ ఊహించని దెబ్బకు రోషన్ బాలకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. పచ్చని పొలాల్లో నవ్వుతూ తిరిగిన వ్యక్తి.. క్షణాల్లో విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబానికి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.
