వామపక్ష నేతలు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో వామపక్ష పార్టీల నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఉమ్మడి కార్యాచరణతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని జనసేన, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ సమావేశంలో ఖండించారు. అవసరం లేకున్నా బలవంతపు భూసేకరన చేస్తే ఉమ్మడిగా పోరాటం చేస్తామని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. రైతులు, కార్మికులు, యువతకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. బలవంతపు భూసేకరణ రాష్ట్రంలో ఎక్కడ జరిపినా రైతుల పక్షాన నిలబడి అన్నింటికి తెగబడి పోరాటం చేస్తామని చెప్పారు.
