పంజాబ్ రాష్ట్రంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రూ.50 విలువైన లాటరీ టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తికి ఏకంగా రూ.30 లక్షల బహుమతి తగిలింది. అయితే ఆ లాటరీ విజేత ఎవరనే విషయం తెలియక నిర్వాహకులు ఇప్పుడు అతని కోసం గాలిస్తున్నారు.
సమాచారం ప్రకారం పంజాబ్‌లో లాటరీలు నిర్వహించే ఒక సంస్థ ఫిబ్రవరి 26న డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించింది. ఈ డ్రాలో బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన టికెట్‌కు రూ.30 లక్షల లాటరీ బహుమతి వచ్చినట్లు ప్రకటించారు. కానీ ఆ టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, ఫోన్ నంబర్ టికెట్‌పై నమోదు చేయకపోవడంతో అతని వివరాలు తెలియడం లేదు.
దీంతో లాటరీ నిర్వహణ సంస్థ విజేతను వెతికే ప్రయత్నాలు ప్రారంభించింది. అతను ఎక్కడ ఉన్నా వచ్చి తన బహుమతిని తీసుకెళ్లాలని నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. విజేత ఆచూకీ తెలుసుకునేందుకు మైకులు, డప్పులతో స్థానిక గల్లీల్లో చాటింపులు వేయిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా లాటరీ నిర్వాహకులు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు. విజేతను ప్రకటించిన తర్వాత ఒక నెలలోపు ప్రైజ్ మనీ తీసుకోకపోతే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని తెలిపారు. అందువల్ల రూ.30 లక్షల బహుమతి గెలుచుకున్న వ్యక్తి త్వరగా ముందుకు వచ్చి తన బహుమతిని స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
