తెలుగు రాష్ట్రాలకు పెళ్లిళ్ల ఫోబియా పట్టుకుంది. ఈ నెలాఖరు వరకే మంచి ముహూర్తాలు ఉండడంతో ఈ పది రోజుల్లోనే పెళ్లిళ్లు అయిపోవాలని ఆరాటపడుతున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గుళ్లు.. కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. ఏప్రిల్ 30 వ తేది దాటితే మళ్లీ 116 రోజుల వరకూ మంచి ముహూర్తాలు లేకపోవడమే కాదు… కృష్ణానది పరివాహక ప్రాంతాల వారికి మరీ ఇబ్బందిగా మారింది.
ఆ నదికి ఆగస్టులో పుష్కరాలు రావడంతో వివాహాలకు వేచి చూడాల్సిందే. ఇక ద్వారక తిరుమల, యాదాద్రి, తిరుపతి, వేములవాడ, శ్రీకాళహస్తి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైతే ఖాళీలే లేవని బోర్డులు కూడా పెట్టేస్తున్నారు.
కల్యాణ మండపాలకే కాదు.. పెళ్లి క్రతువు చేసే పురోహితులు, వంటలు వండే వారు… ఇలా అందరూ బిజీగానే ఉన్నారు. ఈ నెల 21, 24, 29 తేదీల్లో మంచి ముహూర్తం ఉండడంతో ఆ మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరుగనున్నాయి.
