ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. కోర్టుకు హాజరుపై తనకు వ్యక్తిగత మినహాయింపు కోరుతూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు స్వీకరించింది. కోర్టుకు హాజరుపై తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. కానీ కోర్టు కొట్టేసింది.
అయితే, ఇప్పుడు ఎందుకు పిటిషన్‌ను తాము అనుమతించాలని సీబీఐ కోర్టు జగన్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.పరిస్థితులు మారాయని విచారణ చేపట్టొచ్చని జగన్ తరపు లాయర్ కోర్టుకు సూచించారు. జగన్ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు.. పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.
2011 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన కోర్టుకు హాజరయ్యారు. ముఖ్య మంత్రి అయిన తర్వాత ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కోర్టులో తనకు బదులుగా తన లాయర్ హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం కుదరదని, ప్రోటోకాల్ అంశాలు, భద్రతా పరమైన అంశాల వల్ల సాధ్యం కాదని, కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ పిటిషన్ లో కోరారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదని.. హైదరాబాద్ రావడానికి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇది రాష్ట్రఆర్థిక వ్యవస్థకు భారం అని వాటన్నింటి పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరారు.
