ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త, కూతురిని చంపి మూడు రోజులుగా మృతదేహాలతోనే ఉంటోంది మహిళ. చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నారు అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి.
నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతోంది రమ్య. ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం చెప్పారు.
ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు రమ్య సోదరుడు.తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు. పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలించారు.
రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
