నటి రేణు దేశాయ్ వీధి కుక్కల అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల కొన్ని చోట్ల కుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల నేపథ్యంలో, అన్ని కుక్కలను చంపేయాలనే డిమాండ్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కుక్కలు కరిస్తే మిగతా కుక్కలన్నింటినీ చంపేస్తారా? అని ప్రశ్నించిన రేణు దేశాయ్, ఈ తర్కం ఎంత అమానుషమో వివరించారు.
“మగాళ్లు రేప్ చేస్తారు, మర్డర్లు కూడా చేస్తారు. అంతమాత్రాన మగాళ్లందరినీ రేపిస్టులు, హంతకులు అంటామా? నేరం చేసిన వారిని శిక్షించాలి గానీ, ఒక వర్గం మొత్తాన్ని నాశనం చేయడం న్యాయమా?” అని ఆమె వ్యాఖ్యానించారు. కుక్కల విషయంలో కూడా ఇదే న్యాయం వర్తించాలని ఆమె స్పష్టం చేశారు.
అన్యాయంగా కుక్కలను చంపితే కర్మ తప్పక వెంటాడుతుందని హెచ్చరించిన రేణు దేశాయ్, తాను అన్ని కుక్కలూ మంచివే అని చెప్పడం లేదని స్పష్టంగా చెప్పారు. కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు చనిపోవడం అత్యంత బాధాకరమని, ఒక తల్లిగా ఆ బాధ ఎంత తీవ్రమో తనకు తెలుసని భావోద్వేగంగా వెల్లడించారు.
అయితే సమస్యకు పరిష్కారం హింస కాదని, శాస్త్రీయమైన మార్గాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వంటి పద్ధతులను సమర్థవంతంగా అమలు చేయాలని, స్థానిక సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మానవత్వంతో, బాధ్యతతో వ్యవహరిస్తేనే సమాజం ముందుకు సాగుతుందని రేణు దేశాయ్ వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు దారితీశాయి.
