పదేళ్లు.. ఇరవై ఏళ్లు.. ముప్పై ఏళ్లు.. కాలం ఎంత వేగంగా మారిపోయినా స్కూల్, కాలేజీ రోజుల నాటి ఆ పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మన గుండెల్లో పచ్చగానే ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో పాత స్నేహితులను కలుసుకోవడానికి ‘గెట్ టుగెదర్’ లేదా ‘రీయూనియన్’ (Reunion) అనే కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంది. కానీ, నాణేనికి మరోవైపు ఉన్నట్లు.. మధుర స్మృతులను నెమరవేసుకోవడానికి వేదికలు అవ్వవలసిన ఈ గెట్ టుగెదర్లు, ఈ మధ్యకాలంలో కొన్ని పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. దశాబ్దాల క్రితం ముగిసిపోయిన పాత ప్రేమలు మళ్లీ చిగురించి, వివాహేతర సంబంధాలుగా మారి, చివరికి ప్రాణాలు తీసే భయంకరమైన క్రైమ్ స్టోరీలుగా మారుతున్నాయి.
ఇదంతా మొదట చాలా సరదాగా ప్రారంభమవుతుంది. ఎవరో ఒకరు చొరవ తీసుకుని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. పాత విషయాలు మాట్లాడుకునే క్రమంలో అప్పట్లో క్లాస్‌లో ఇష్టపడి చెప్పలేకపోయిన వాళ్లు లేదా బ్రేకప్ అయిన వాళ్లు మళ్లీ కనెక్ట్ అవుతారు. పెళ్లై పిల్లలు ఉండి, ఆఫీస్ వత్తిడి, సంసార బాధ్యతలతో విసిగిపోయిన సగటు మనిషికి ఈ పాత స్నేహితుల పరిచయం ఒక పెద్ద రిలాక్సేషన్ లా అనిపిస్తుంది. సైకాలజిస్టుల విశ్లేషణ ప్రకారం.. మనిషి ఎప్పుడూ తన గతాన్ని చాలా అందంగా ఊహించుకుంటాడు. ప్రస్తుత జీవితంలోని బాధ్యతల కంటే, నాటి బాధ్యతలు లేని రోజుల్లోని భాగస్వామే మిన్న అనే భ్రమలో బతకడం ప్రారంభిస్తాడు. ఈ చాటింగ్‌లు కాస్తా సీక్రెట్ కాల్స్‌గా మారి, గెట్ టుగెదర్ ఈవెంట్స్‌లో నేరుగా కలుసుకోవడంతో అక్రమ సంబంధాలకు దారి తీస్తున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఒళ్లు గగుర్లు పుడుతుంది. 30 ఏళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్‌లో కలుసుకున్న ఒక జంట, తమకు పెళ్లై పెద్ద పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయారు. భర్త తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి ఆ భార్య భర్తకు నమ్మకంగా విషమిచ్చి చంపేసింది. మరొక ఘటనలో కాలేజీ రీయూనియన్‌లో కలిసిన పాత ప్రేమికులు భార్యాభర్తలను వదిలేసి పారిపోవాలని ప్లాన్ చేశారు. ఆస్తి కోసం భర్తను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేశారు. చివరికి కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
పోలీసుల రికార్డుల ప్రకారం.. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాహేతర సంబంధాల నేరాలలో దాదాపు 15% నుండి 20% కేసులు ఈ సోషల్ మీడియా పరిచయాలు, రీయూనియన్ల ద్వారా ఏర్పడినవే కావడం గమనార్హం.
ఫ్రెండ్స్‌ని కలవడం తప్పు కాదు, కానీ ప్రతి బంధానికి ఒక ‘లక్షమణ రేఖ’ ఉంటుంది. నా భర్త లేదా భార్య నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు కానీ నా పాత క్లాస్మేట్ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో అనే భ్రమలో బతుకుతారు. కానీ వాస్తవం ఏంటంటే, ఆ పాత స్నేహితుడితో మీకు సంసార బాధ్యతలు లేవు కాబట్టి అంత బాగుంటుంది. అదే అతనితో జీవితం పంచుకుంటే అక్కడ కూడా సమస్యలు వస్తాయి అనే నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ క్షణికమైన ఆకర్షణ కోసం కన్న పిల్లల భవిష్యత్తును, సమాజంలో గౌరవాన్ని పణంగా పెట్టి జైలు పాలవుతున్నారు.
స్నేహం అనేది ఒక పవిత్రమైన బంధం. దశాబ్దాల తర్వాత కలిసిన స్నేహితులను చూసి సంతోషపడాలి కానీ, ఆ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని పచ్చని సంసారాలను కూల్చుకోకూడదు. ఒక తప్పు వంద తప్పులకు దారితీసి చివరికి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటుంది, ఆలోచించండి!
