తమ పార్టీ తరపున గెలిచి తెలుగుదేశం వైపు వెళ్లిన నేతలు అంటే ఏ పార్టీ వారికైనా బోలెడంత కోపం ఉంటుంది. అధికార యావతో వారు పక్కదారులు చూసుకోవడం వారిని గెలిపించిన పార్టీల అభిమానులను ఇబ్బంది పెడుతుంది.
అయితే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలో మాత్రం ఈ ఫీలింగ్ తక్కువగానే ఉన్నట్టుంది. తన పార్టీ తరపున గెలిచి తెలుగుదేశం వైపు వెళ్లిన ఎంపీలతో ఆయన వ్యవహరిస్తున్న తీరే దీనికి రుజువు!
తాజాగా కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కర్నూలులో జరిగిన మినీ మహానాడులో ఆయన పాల్గొన్నాడు. ఇతర తెలుగుదేశం నేతల్లాగానే ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాలపంచుకొన్నాడు. పార్టీ కండువా వేసుకోలేదు కానీ.. ఆయనైతేఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రసంగించలేదు కానీ.. హాజరు పలికి వచ్చాడు. కాసేపు కూర్చొని వచ్చాడు.
మరి ఎస్పీవైరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వ్యక్తి అని వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఆయన జెండా తిప్పేశాడు. తెలుగుదేశం పార్టీ వైపు చేరిపోయాడు. అప్పటికీ వైకాపా వాళ్లు ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ తరపున గెలిచి.. తమ పార్టీ గీత దాటిన ఎస్పీవైరెడ్డి, గీతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆ చర్యలేమీ ఇప్పటి వరకూ తీసుకొన్న దాఖలాలు కనిపించడం లేదు. మరి ఈ ఫిరాయింపు దారులపై చర్యలు ఏమిటో.. ఎప్పటికో!
