నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) BPO విభాగంలో మత మార్పిడికి ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్, కార్యాలయంలోని ఇతర మహిళా ఉద్యోగులకు నమాజ్ ఎలా చేయాలో నేర్పించారని మరియు వారిని హిజాబ్ ధరించమని ప్రోత్సహించారని బాధితులు తాజాగా ఆరోపించారు.
ఇతర మతాలకు చెందిన ఉద్యోగులను ఇస్లాం వైపు ఆకర్షించేందుకు నిదా ఖాన్ ప్రయత్నించారని, పని వేళల్లో మతపరమైన చర్చలు చేసేవారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిదా ఖాన్ తనను ఇస్లాం మతం స్వీకరించమని నిరంతరం వేధించేవారని, అలా చేస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయని నమ్మించేవారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై నాసిక్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిదా ఖాన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కంపెనీలోని సీసీటీవీ దృశ్యాలను మరియు ఇతర సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ పరిణామాలపై TCS స్పందిస్తూ.. తమ కార్యాలయంలో అందరికీ సమాన గౌరవం ఉంటుందని, ఇలాంటి ప్రవర్తనను సహించబోమని స్పష్టం చేసింది. నిందితురాలిని ఇప్పటికే విధుల్లో నుంచి తొలగించినట్లు సమాచారం.
ఒక కార్పొరేట్ కార్యాలయంలో మత మార్పిడి యత్నాలు మరియు మతపరమైన ఆచారాలను రుద్దడం వంటి ఆరోపణలు రావడం స్థానికంగా మరియు ఐటీ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. పోలీసులు ఈ కుట్ర వెనుక ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
