మోడీహవాతో కాని పని పవనిజంతో అవుతుందని కమలం పార్టీ భావిస్తోందా..? కేంద్రంలో అధికారం ఉన్నా రాజకీయాల్లో కనీసం బోణీ కూడా చేయని పార్టీనే నమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడిందా..? గ‌్రేటర్‌లో ఆడలేని ఆటకు జనసేన మద్దెలదరువును ఆశ్రయిస్తోందా..? అంటే అవుననే చెపుతున్నాయి తాజా పరిణామాలు.
సీమాంధ్ర ఎన్నికల్లో తమ మిత్రకూటమికి విజయం చేకూర్చి పెట్టిన పవన్‌కళ్యాణ్ కార్డును ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో వాడేందుకు బిజెపి స్కెచ్ వేసింది. తాజాగా టి.బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. పవన్‌కళ్యాణ్ ఇష్టపడితే జీహెచ్‌యంసి ఎన్నికల్లో పోటీకి ఆహ్వానిస్తామంటూ ప్రకటించారు కిషన్‌రెడ్డి. జీహెచ్‌యంసి ఎన్నికలకు నోటిఫికేషన్‌కూడా విడుదల కాకముందే కమలం పార్టీ చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటమి ఖాయంగా కనిపిస్తున్నా పోటీచేయక తప్పని పరిస్థితిలో పక్కచూపులు చూస్తోంది బిజెపి.
మిత్రపక్షమైన టిడిపికి ఇదివరకు గ్రేటర్‌లో ఉన్న బలం అమావాస్య చంద్రుడిలా రోజురోజుకూ క్షీణిస్తుండడంతో తమను ఆదుకునే నాథుడికోసం వెతుకులాటలో పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో పవన్‌కళ్యాణ్ వారికి తిరుగులేని ఆయుధంగా కనిపిస్తున్నారు. తాము ఒంటరిగా పోటీచేసినా, మిత్రపక్షం టిడిపితో కలిసి పోటీచేసినా గ్రేటర్ పీఠంపై జెండా కాదుకదా చెప్పుకోదగ్గ స్థానాలైనా వస్తాయా అని అనుమానపడుతోంది గ్రేటర్ కమలం పార్టీ. కనీసం ప్రజల్లో అంతో ఇంతో ఛరిష్మా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కు బహిరంగ ఆహ్వానం పలికిందని తెలుస్తోంది.
అయితే… ఇప్పుడు ఒక్కటే అనుమానం పవన్‌కు ఆహ్వానం పలకడం ద్వారా భారతీయ జనతాపార్టీ తాము, తమ మిత్రపక్షం కలిసి కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నామని గ్రేటర్ ప్రజలకు ముందస్తుసూచన చేస్తోందా.. లేక మహాప్రభో ఇక నీవేదిక్కు అని పవన్‌కు సాగిలబడినట్లా అన్నది తెలియాల్సిన అంశం. అయితే నాయకత్వలోపంపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిజెపి అధిష్టానం తెలుగురాష్ట్రాల్లో పార్టీ పగ్గాలను పవన్‌కళ్యాణ్‌కు అప్పగించే ప్రయత్నం అనే అనుమానాలనూ వ్యక్తంచేస్తున్నారు కొందరు విశ్లేషకులు. చెప్పలేం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
