తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళాలు (Donations) ఇవ్వవద్దని ఆయన కోరారు.
కొన్ని సంస్థలు శ్రీవారి పేరుతో భక్తుల నుంచి అక్రమంగా విరాళాలు సేకరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ వంటి పేర్లతో కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.ఈ సంస్థల వలలో భక్తులు పడకూడదని, అక్రమార్కుల బారిన పడి మోసపోవద్దని చైర్మన్ నాయుడు కోరారు.
దేవుడి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విరాళాలు ఇవ్వదలిస్తే, కేవలం అధికారిక TTD ఛానెళ్ల ద్వారా లేదా నేరుగా దేవస్థానం కార్యాలయాలలో మాత్రమే అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీవారి భక్తుల రక్షణ, వారి ధనాన్ని కాపాడటం టీటీడీ బాధ్యత అన్నారు.
