టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో బీఆర్ నాయుడు ఉన్నారని తెలిసిన వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని ధర్నా చేపట్టారు. గత 30 ఏళ్లుగా ఓ మహిళను బీఆర్ నాయుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొంటూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమయంలో బీఆర్ నాయుడు అనుచరులు అక్కడికి చేరుకుని వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటికి పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ నాయుడు అనుచరులు వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిరసన చేస్తున్న పలువురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కార్యకర్తలపై దాడి చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
