సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.కాని ఆ నయనాలే లేకపోతే ప్రపంచాన్ని ఎలా చూస్తారు. ఇంద్ర దనస్సు అందాలను ఎలా ఆస్వాదిస్తారు. ఎంతోమంది జన్యుపర కంటిపొర వ్యాధి సమస్యతో బాధపడుతుంటారు.ఇందుకోసమని అమెరికా… దీని నియంత్రణ కోసం ఓ ఔషధాన్ని తయారుచేసింది.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది. న్యూయార్క్ నగరంలో జనవరి – 4న…. కంటి వ్యాధిని తగ్గించే ఔషధం ఖరీదు అక్షరాల 5.4 కోట్లు. అమెరికాలో రూపొందించిన ఈ ఔషధం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఒకటిగా నిలిచింది.
వంశపారంపర్యంగా సంక్రమించే కంటి పొర రెటీనాకు సంబంధించిన వ్యాధిని నయం చేసేందుకు వినియోగించే ఔషధం లక్సటర్నాతో.. అంధత్వ సమస్య పూర్తిగా తొలిగిపోనున్నది. అమెరికాలో ఈ ఔషధాన్ని రూ.5.40 కోట్ల అనగా…8.5 లక్షల డాలర్లకు విక్రయించనున్నారు. ఔషధ తయారీ సంస్థ ఫిలడెల్ఫియాకు చెందిన స్పార్క్ థెరప్యూటిక్స్ తెలిపిన ప్రకారం.. ఒక్క డోస్‌తో రెటీనా సమస్యను నియంత్రించవచ్చు. ఈ ఔషధం కోసం ఒక్కో కంటికి రూ.2.70 కోట్లు 4.25 లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే గత డిసెంబర్‌లో ఇది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది.
వినూత్నమైన ఈ చికిత్స కోసం వినియోగించే ఔషధం ఖరీదుపై అమెరికా చర్చలు జరిపి.. ఆ తర్వాత ప్రకటించింది. ఒకవేళ ఈ ఔషధం ప్రభావం చూపలేదని రోగులు భావిస్తే.. నగదు తిరిగి చెల్లించేందుకు సిద్ధమని స్పార్క్ హామీ ఇచ్చింది. ఇప్పటికే లుకేమియాతో బాధపడేవారికి చికిత్స అందించేందుకు నోవర్టిస్ కంపెనీ దాదాపు 3 కోట్ల ఖరీదైన కిమ్‌రియా ఔషధాన్ని విక్రయిస్తున్నది. ఈ మందు సరిగాపనిచేయకపోతే చెల్లించిన మొత్తం తిరిగి ఇస్తామని స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన ఔషధ తయారీదారుడు గతంలో ప్రకటించినట్టుగానే.. ప్రస్తుతం లక్సటర్నా కూడా ప్రకటించింది.
