తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపిలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు.
కర్నూలులో జగన్ మూడు రోజుల పాటు జలదీక్ష ప్రారంభించారు. కర్నాటక, మహరాష్ట్రలు తమకున్న 1750 టిఎంసిల నీటిలో 1300 టిఎంసిల నీటిని వాడేసుకున్నాయని ఆరోపించారు. మిగిలిన నీటిలో శ్రీశైలం డ్యాంకు నీరు రాకముందే 180 టిఎంసిల నీటిని పాలమూరు జిల్లాకు తరలించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఎపి పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 11 కింద కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టుల ప్రస్తావన లేదని అన్నారు. రెండు రాష్ట్రాలు ఏమైనా ప్రాజెక్టులు కట్టాలంటే సీడబ్య్లూసి, వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలని, ఇలాంటివి ఏవీ చేయకుండా ప్రాజెక్టులు కట్టేస్తున్నారని జగన్ ఆరోపించారు. జగన్ దీక్ష మంగళవారానికి రెండురోజుకు చేరుకుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు,పలువురు నాయకులు పాల్గొన్నారు.
