ఏపీకీ ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామాల అమలు విషయంలో మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిమీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. అయితే తాజాగా టీడీపీపై భాజాపా మంత్రి మాణిక్యాల్‌రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక మిత్రపక్షంతో విడాకులు తీసుకొనేందుకు సిద్దమయ్యారనే చెప్పవచ్చు.
విజయవాడలో బీజేపీ కీలక నేతల సమావేశంలో పార్టీ ఎంపీ హరిబాబు, మరో నేత లక్ష్మీపతిరాజా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీని మొదటి నుంచి కట్టడి చేసుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఏపీలో బీజేపీ బలపడకుండా కొందరు నేతలు పక్కదారి పట్టిస్తున్నారని, పార్టీ విధివిధానాలు పాటించే అంశంలో తాము కూడా బాధ్యులుగానే ఉన్నామని లక్ష్మీపతిరాజా అన్నట్టు సమాచారం.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డట్టు సమాచారం. మిత్రపక్షంతో పొత్తుపై మంత్రి మాణిక్యాల్ రావ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకరు తమతో పొత్తు వదులుకుంటే, మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దామని తమ నేతలతో ఇప్పటికే చెప్పానని మాణిక్యాలరావు అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుతామని అన్నారు. మంత్రి పదవులకి రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని తెలిపారు.
