Tuesday, May 14, 2024
- Advertisement -

జగన్ కీలెరిగి వాత పెట్టిన చంద్రబాబు

- Advertisement -

కీలెరిగి వాత పెట్టాలంటారు. రాజకీయాల్లో ఇది మరింత ముఖ్యం. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ విషయంలో మిష్టర్ పర్ ఫెక్ట్. రాజకీయ ప్రత్యర్ధులను అదనుచూసి చావుదెబ్బకొట్టడంలో ఆయనను మించినవారే లేరేమో. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ల అంశంపైనా చంద్రబాబు మరోసారి తన అనుభవాన్ని, రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు.

కాపుల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవు. నేను అధికారంలోకి వచ్చినా కాపులకు రిజర్వేషన్లు ఇస్తాను అని హామీ ఇవ్వలేను. జరగని జరుగుతాయని చెప్పలేను, చంద్రబాబు లాగా మాట ఇచ్చి మోసం చేయలేను. కాపుల రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కనుక, వాటిపై నేను హామీ ఇవ్వలేను. కానీ ఏడాదికి వెయ్యి కోట్లు కాపు కమిషన్ కోసం కేటాయిస్తాను అని, చంద్రబాబులాగా చెప్పారు. ఈ నాలుగేళ్లలో కేవలం 1,350 కోట్లు మాత్రమే ఇచ్చారు. నేను అలా చేయను. రిజర్వేషన్లపై మాట ఇవ్వను. కానీ చంద్రబాబు ఇస్తానని చెప్పిన 5000 కోట్లకు రెట్టింపు…అంటే 10 వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమానికి ఇస్తాను..అని జగన్ ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ప్రకటించారు. ఆ ప్రకటన మిస్ ఫైర్ అయింది. ఏపీలోని కాపులతో పాటు వైఎస్ఆర్ సీపీలోని కాపు నేతలు కూడా జగన్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధ పడుతున్నారు. కాపుల రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయి కాబట్టి నేను ఏమీ చేయలేననని చేతులెత్తేయడం చేతిగానితనమా ? అమాయకత్వామా ? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారాన్ని పోరాడి సాధించేస్తాను అని చెప్పుకునే జగన్, కాపుల రిజర్వేషన్లను మాత్రం సాధించలేను, నా వల్ల కాదు, నాకు చేతకాదు అని చెప్పుకోవడం సిగ్గుచేటనే విమర్శలు కాపుల నుంచే కాకుండా టీడీపీ నుంచీ జోరందుకున్నాయి. దీంతో అని వైఎస్ఆర్ సీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది.

ఇదే సమయంలో చంద్రబాబు తన రాజకీయవ్యూహాలకు పదును పెట్టారు. నేడు తమ టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ తో పార్లమెంట్ లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రైవేట్ బిల్లు పెట్టిస్తున్నారు. ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు కాపుల రిజర్వేషన్ అంశంపై టీడీపీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. అనే మెసేజ్ బలంగా కాపులకు వెళ్లాలంటే ఇదే సరైన సమయమని, ప్రైవేట్ బిల్లు పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జగన్ వ్యాఖ్యలతో కాపులు రగిలిపోతున్నారు. కనుక ఆ మంటలను మరింత రాజేయాలంటే ఇదే గొప్ప అవకాశం అని, ప్రైవేట్ బిల్లు పెట్టడంతో చర్చను చేపట్టి కాపుల మనసులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో నేడు టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టారు. కేంద్రప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరనున్నారు. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని అవంతి శ్రీనివాస్ కోరారు.

ఏపీలో 49 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మరోవైపు 50 శాతం రిజర్వేషన్లు దాటితే సుప్రీం కోర్టు అంగీకరించదు. ఇప్పుడు మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అనంతరం పార్లమెంట్ ఆమోదించాలి. కానీ ప్రస్తుతం అది జరిగే పరిస్థితులు కనిపిచడం లేదు. అదే జరిగితే కాపుల ఓట్లు మొత్తం టీడీపీకి పడిపోతాయి. చంద్రబాబు కాపుల ఆరాధ్య దైవం అయిపోతారు. అందుకు మోడీ ఏమాత్రం అంగీకరించరు. వైఎస్ఆర్ సీపీ ఎటూ ఈ లెక్కలన్నీ అంచనా వేసి బీజేపీని, మోడీని ఇదే అంశంపై వెనక్కి లాగుతుంది. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ప్రతి కాపు ఇంటిలో చంద్రబాబు విగ్రహాలు పెట్టేసుకుంటారు. ఓట్లు అన్నీ ఆయనకే పడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దు అని బీజేపీ పెద్దలకు వైఎస్ఆర్ సీపీ తెరవెనుక చెప్పుకోవడం ఖాయం.

కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రత్యేకహోదాను సాధించేస్తాను అని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కాపుల రిజర్వేషన్లపై నేనేమీ చేయలేను, నా వల్ల కాదు, నాకు సత్తా లేదు. అని జగన్ చేతులెత్తేశారు. కానీ మేము మాత్రం జగన్ లా కాదు. కాపుల కోసం ఇప్పటికే మంజునాథ కమీషన్ వేయించాం. నివేదిక ఆధారంగా విద్యా, ఉద్యోగాల పరంగా 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపి, కేంద్రానికి పంపాం. ఇప్పుడు ప్రైవేట్ బిల్లు పెట్టి మోడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అని టీడీపీ ప్రచారం చేుకుంటోంది. రాజీనామాలు చేసేసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఏం చేయాలో దిక్కుతోచక డామిట్ కాపుల కథ అడ్డం తిరిగింది..అని చేతులు నులుముకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -