- Advertisement -

సీనియర్ నాయకులకు చంద్రబాబు వెల్ కమ్

- Advertisement -

ముందస్తు ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికలు మాత్రం పక్కా కదా. అందులోనూ ఈ సారి చంద్రబాబు రాజకీయ జీవితం అత్యంత కీలక దశలో ఉంది. ఈ సారి జాతీయ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించి, కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పే టైం వచ్చేసింది. గతంలో ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా చంద్రబాబుకి ప్రధాని పదవి చేపట్టే అవకాశం కూడా వచ్చింది. కానీ పూర్తి మెజార్టీ లేని కారణంగా ఆ పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అని అంచనా వేసిన ఆయన, నాడు వెనకడుగువేశారు. దీంతో నాడు హెచ్ డీ దేవగౌడ్ కు ఆ అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పూర్తి మెజార్టీ సాధించే అవకాశాలు అంతంతమాత్రమేనని ఇప్పటికే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో ఇండియా టుడే పత్రిక సర్వేలతో తేల్చేసింది.

ఒక్క ఇండియాటుడే సర్వేనే కాదు, పలు ఇతర సంస్థల అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 282 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ ఈ సారి ఆ 282 సీట్లలో 150 కోల్పోవడం పక్కా అని ఢంకా బజాయించి మరీ సర్వేలు చెబుతున్నాయి. దీంతోనే మోడీ, షా కొంత దూకుడు తగ్గించారు. ఇక దేశమంతటా ఉన్నా కానీ కమ్యూనిస్టులు ఉనికి కోసమే పోరాడుతున్నారు తప్ప. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో వాళ్లు పుంజుకోలేకపోతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల బలాబలాలే 2019లోని కేంద్రంలో అధికార పీఠంపై ఎవరిని కూర్చో బెట్టాలనేది నిర్ణయించేది.

జాతీయ పార్టీలు బలహీనపడుతుండటంతో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. రాష్ట్రాల వారీగా ఆయా ప్రాంతీయ పార్టీలు శక్తిమేరా పోరాడుతున్నాయి. తమకు వచ్చే ఎంపీల స్థానాలే జాతీయస్థాయిలో తమ ప్రయోజనాలు నెరవేర్చే అస్త్రాలని గ్రహించి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకునేందుకు వ్యూహం రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఏపీలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజావ్యతిరేకత ఆధారంగా వారిని మార్చటం, వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల్లో దాదాపు 40 మంది సిట్టింగ్ లకు ఈ సారి టికెట్ నిరాకరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో మొదట్నించీ పార్టీని నమ్ముకుని పని చేస్తున్నవారికి, ద్వితీయ శ్రేణి నాయకులకు, క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్తవారికి అవకాశమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. పాతవారికి, అసంతృప్తి నేతలకు నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు కల్పించాలని వ్యూహం రచిస్తున్నారు.

అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి జనసేన వైపు చూస్తున్న కాపు నాయకులను టీడీపీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవులు, ఎంపీలుగా వెలిగిపోయి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు సీనియర్ నాయకులను జిల్లాల వారీగా టీడీపీలోకి ఆహ్వానం పంపుతున్నారు. అన్ని జిల్లాల్లోని, సీనియర్ నాయకులను గత పార్టీ, రాజకీయచరిత్రతో సంబంధం లేకుడా టీడీపీలో చేర్చుకోవాలని చంద్రబాబు ఇప్పటికే వ్యూహరచన చేశారు. 20కి తక్కువ కాకుండా ఎంపీ స్థానాలు, 120 ఎమ్మెల్యే స్థానాలే లక్ష్యంగా పని చేయాలని పార్టీ సీనియర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్పించే బాధ్యత జిల్లాల వారీగా టీడీపీ సీనియర్లకే అప్పగించారు. ఒకవేళ వాళ్లు టీడీపీలో చేరకపోయినా జగన్ పార్టీ, జనసేన పార్టీల్లో మాత్రం చేరకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా సీనియర్ నాయకులదేనని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -