సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వివిధ సర్వే సంస్థలు, జాతీయ ఛానళ్లు సర్వేలను విడుదల చేస్తున్నాయి. ఇందులో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ దుమ్ము రేపుతుందని.. చంద్రబాబుకు పరాభవం తప్పదని అన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. సర్వేల్లో ఎక్కడా కూడా జనసేన పేరు మాత్రం కనిపించడం లేదు. అంటే సర్వే సంస్థలు జనసేనను లెక్కలోకి తీసుకోలేదా? లేదా జనాల్లో అసలు జనసేనకు బలమే లేదా? లేక జనసేనను ఇంకా టీడీపీ అనుబంధ పార్టీగానే అవి భావిస్తున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
జాతీయ మీడియా తమ సర్వేలను గత ఏడాది నుంచి మొదలు ఈ జనవరి మధ్య చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్నారు. ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే పవన్ ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఆయన కొన్ని జిల్లాలకే పరిమితమయ్యారు. కానీ ఆయన ప్రజల్లోకి అంతగా వెళ్లనందునే జనసేనను ఇతరులలోకి లెక్కకట్టారా? అని కూడా తెలియాల్సి ఉంది. ప్రత్యేక హోదా అంశంలో దెబ్బతినడంతో బీజేపీని నమ్మే స్థితి లేదు. ఇక ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపనందున కాంగ్రెస్ కథ కూడా కంచికే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో యూపీఏతో పొత్తు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నందున ఏపీలో టీడీపీని, కాంగ్రెస్‌ను ఒకే పార్టీగా చూడాల్సి వస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో.. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, జనసేన మధ్యనే పోరు ఉంటుందని స్పషమవుతోంది.
ఏపీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏమాత్రం తక్కువగా ఉండదనేది స్పష్టం. జనసేన గెలుస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో వచ్చినట్టు హంగ్ ఏర్పడినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని, అప్పుడు జనసేన చక్రం తిప్పడం ఖాయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వస్తున్న ప్రీపోల్ సర్వే ఫలితాలు.. జనసేనను కూడా పరిగణలోకి తీసుకుంటే అంతో ఇంత మార్పు తప్పనిసరి అనేది స్పష్టం. ఇటీవలి సర్వేల్లో వైఎస్ఆర్‌సీపీకి 13 నుంచి 19, టీడీపీకి 6 నుంచి 11 సీట్లు వస్తాయని తేలాయి. జనసేన ప్రభావం ఉంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత? జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? అనేది ఏ సర్వేలో చెప్పలేదు. కానీ జనసేన అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తప్ప… మరో పేరు వినిపించదు. మరో మొఖం కనిపించదు. అసలు అభ్యర్థులు ఎవరన్నది ఇంకా సూత్ర ప్రాయంగా కూడా నిర్ణయం జరగలేదు. ఇది కూడా జాతీయ మీడియాఇంకా జనసేనను పట్టించుకోకపోవడానికి ఓ కారణం కావచ్చు.
