ఒకవైపు గిద్దలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు అది గనుక దక్కకపోతే వైసీపీకి వీలైనంత నష్టం చేయాలని చూస్తోంది.. ఆ పార్టీ నేతగా చలామణిలో ఉన్న సాయికల్పన రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన సాయి కల్పన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్లిపోయాకా ఈమె వైసీపీలోకి వచ్చారు. అయితే అశోక్ రెడ్డితో ఈమెకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. వైసీపీ తరఫున తను టికెట్ సంపాదించుకుని, మరోవైపు టీడీపీ తరఫున అశోక్ రెడ్డి పోటీలోకి దిగితే.. కాంప్రమైజ్ అయిపోయే ఉద్దేశంతో వీళ్లిద్దరూ స్కెచ్ వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. వైకాపాలో సాయికల్పనకు టికెట్ దక్కడం కష్టమే అనే మాట వినిపిస్తోందిప్పుడు. మరి అదేగనుక దక్కకపోతే వైసీపీకి వీలైనంత నష్టం చేయడానికి కూడా ఈమె స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. తాజాగా అందుకు సంబంధించిన పరిణామాలు కూడా అగుపిస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘పల్లెనిద్ర- రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక జెండా దిమ్మెను సాయికల్పన అనుచరులు ధ్వంసం చేయడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇఫ్పుడు నియోజకవర్గంలో రచ్చకు ఎక్కింది. సాయికల్పన తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోందని అందుకే ఇలాంటి పనులకు పూనుకున్నట్టుగా ప్రచారం జరుగోతంది. అందుకే ఆమె అనుచరులు ఇలాంటి పనులకు తెగబడుతున్నారనే మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నియోజకవర్గ నేతలుగా చలామణి కావడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అశోక్ రెడ్డిని నమ్మి గెలిపించుకుంటే అతడు జగన్ కు ద్రోహం చేసి వెళ్లాడు. ఇప్పుడు సాయికల్పన రూపంలో మరొకరు ఇలాంటి చర్యలకు తెగబడుతుండటం వైసీపీ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిణామాలను జగన్ పరిశీలించాలని వారు కోరుకుంటున్నారు.
