అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. భారత్–న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనున్న కీలక ఫైనల్‌కు ముందు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్‌కు అందిన గోప్య సమాచారం ఆధారంగా పోలీసులు ఉస్మాన్‌పురా ప్రాంతంలోని గుజరాత్ విద్యాపీఠ్ ఎస్.టి బస్ స్టాండ్ సమీపంలో ఉచ్చు వేశారు. అక్కడ ఇద్దరు అనుమానితులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఎనిమిది మ్యాచ్ టికెట్లు లభించాయి.
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఈ టికెట్లను ముందుగానే ఆన్లైన్లో కొనుగోలు చేసి, వాటిని మూడింతల ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఒక్క టికెట్‌ను సుమారు రూ.10,000కు విక్రయిస్తూ అభిమానులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి అన్ని టికెట్లను స్వాధీనం చేసుకుని, వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మరింత పెద్ద నెట్వర్క్ ఉందేమోనని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ . ఫైనల్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.స్టేడియం వద్ద భద్రత కోసం 3,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని, సుమారు 1,000 మంది హోమ్ గార్డులను మోహరించనున్నాం అని మాలిక్ తెలిపారు.
